కలం, నల్లగొండ: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలను రాజకీయ కక్షతో నిర్వీర్యం చేస్తోందని, అందులో భాగంగానే కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పథకానికి సంబంధించిన కేసులో హైకోర్టులో ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తోందని, పథకాన్ని సమర్థిస్తూ ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు.
గత తొమ్మిది నెలలుగా వెరిఫికేషన్ పేరుతో పేద లబ్ధిదారులకు అందాల్సిన ఆర్థిక సాయాన్ని నిలిపివేశారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 13 లక్షల మంది పేద కుటుంబాలకు ఈ పథకాలు ఆర్థికంగా కొండంత అండగా నిలిచాయని, వీటిని ఖచ్చితంగా కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న ఆర్థిక సహాయాన్ని వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో విడుదల చేయాలని, ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ కక్షసాధింపు చర్యలు స్వస్తి చెప్పి, పేద ప్రజల సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

