కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) సీఐ అనుముల నిరంజన్ రెడ్డి (CI Niranjan Reddy) కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నక్సల్స్ కార్యకలాపాలు నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష కృషి చేసిన ఆయన ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) అందుకున్నారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెడల్ అందుకున్న నేపథ్యంలో ఆయనను పలువురు అభినందించారు.
సోమవారం కరీంనగర్ సీపీ గౌష్ ఆలంను రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి కలిశారు. విధి నిర్వహణలో ధైర్య సహాసాలు ప్రదర్శించిన సీఐ నిరంజన్ రెడ్డి అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవడం కరీంనగర్ కమిషనరేట్ కే గర్వకారణమని ప్రశంసించారు. పోలీస్ విభాగంలో శ్రమించి పని చేసిన వారికి గుర్తింపు ఎప్పటికైనా లభిస్తుందన్నారు. సమాజ హితం కోసం పని చేసి ఇలాంటి అరుదైన మెడల్స్ కు ఎంపిక కావాలని సీపీ పిలుపునిచ్చారు.
కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎం అందుకున్న సీఐని ఘనంగా సత్కరించారు. ఐపీఎం అందుకున్న తర్వాత తొలిసారి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న నిరంజన్ రెడ్డికి సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అత్యంత అరుదైన మెడల్ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. నిరంజన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీస్ స్టేషన్ సిబ్బంది అభిప్రాయపడ్డారు.

