కలం, వెబ్ డెస్క్ : సైబర్ నేరాల అడ్డుకట్టకు జీరో ఎఫ్ఐఆర్ విధానం అమల్లోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులకు సూచించారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలపై సీఎం అధికారులతో శుక్రవాం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బాధితులు సైబర్ వార్ రూమ్‌కు ఫోన్ చేసిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. బ్యాంకులను అప్రమత్తం చేయాలన్నారు. దీని ద్వారా గోల్డెన్ అవర్ టైంను వినియోగించుకుని అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
పోలీస్ పెట్రోలింగ్ తరహాలోనే సైబర్ పెట్రోలింగ్ కూడా చేపట్టాలని, ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా చూడాలని సీఎం సూచించారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

