Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా సర్ ప్రక్రియ: కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పకడ్బందీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం విషయంలో రాజకీయ పార్టీలు జాప్యం చేయకుండా, వెంటనే జాబితాను నిర్ణీత ఫార్మాట్‌లో అందించాలని సూచించారు. ప్రక్రియ అమలు నేపథ్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం అన్ని నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏ.ఈ.ఆర్.ఓలతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష నిర్వహించారు. పారదర్శతతో కూడిన ఓటరు జాబితా రూపకల్పన కోసమే ఎన్నికల సంఘం సర్ అమలు చేస్తోందన్నారు. బీఎల్ఏల నియామకం కోసం ఇప్పటివరకు కేవలం ఒక పార్టీ మాత్రమే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వివరాలు సమర్పించిందని తెలిపారు. ఈ.ఆర్.ఓల స్థాయిలో ప్రతీ వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై సర్ ప్రక్రియ అమలు గురించి వారికి వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.

బీఎల్వోలకు సహకారంగా వాలంటీర్లు..

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్వోలు ప్రతి ఇంటిని సందర్శించి సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. వారికి సహకారం అందించేందుకు వీలుగా వాలంటీర్లను సమకూర్చాలని సూచించారు. చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల పేర్లు కలిగిన ఓటర్లను మ్యాపింగ్ సందర్భంగా కచ్చితంగా గుర్తించాలన్నారు. తప్పులు లేకుండా ఎన్యుమరేషన్ ఫారం ఎలా నింపాలి అనే దానిపై బీఎల్వోలకు సమగ్రంగా అర్ధమయ్యేలా శిక్షణ అందించాలని ఆదేశించారు. సర్ ప్రక్రియ అమలు తీరు, ప్రగతి గురించి రోజువారీగా ఆన్లైన్‌లో వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సాంకేతిక సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, బోధన్ ఆర్డీవో విజయ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏ.ఈ.ఆర్.ఓలు పాల్గొన్నారు..

ఎన్నికల సంఘం సమీక్షలో పాల్గొన్న కలెక్టర్..

అంతకుముందు సర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించనున్నట్లు సీఈవో స్పష్టం చేశారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించాలన్నారు. ఒక కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా చూడాలని, 1200 మంది ఓటర్ల సంఖ్య దాటితే కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జూలై 1, 1987కు ముందు జన్మించిన వారు తమ స్వీయ గుర్తింపు లేదా జనన ఆధార పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, తల్లిదండ్రుల పత్రాలు అవసరం లేదన్నారు. జూలై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తల్లి లేదా తండ్రి ఎవరిదైనా ఒకరి ధ్రువపత్రం సమర్పించాలని, డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారు తల్లిదండ్రులు ఇద్దరి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా, ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, క్లెయిమ్‌లు, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న ప్రచురించడం జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>