కలం, వెబ్ డెస్క్ : పర్యావరణ ప్రేమికులు, స్థానిక ప్రజల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. రిషికేష్ పరిధిలోని శివాలిక్ అడవుల్లో భానియావాలా-రిషికేష్ రహదారి విస్తరణ ప్రాజెక్టు కోసం వేలాది చెట్లను నరికివేయడాన్ని (Rishikesh Tree Felling) వ్యతిరేకిస్తూ సాగిన భారీ నిరసనలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రజల నుంచి వ్యక్తమైన తీవ్ర ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, సదరు ప్రాజెక్టు స్థలంలో చెట్ల నరికివేతను తక్షణమే నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.
భానియావాలా-రిషికేష్ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు దాదాపు 4,369 చెట్లను నరికేందుకు (Rishikesh Tree Felling) జాతీయ రహదారుల సంస్థ (NHAI) సన్నద్ధమైంది. అయితే, రాజాజీ నేషనల్ పార్క్ ఏనుగుల కారిడార్ పరిధిలోకి వచ్చే ఈ సున్నిత ప్రాంతంలో భారీగా చెట్లను కూల్చివేయడంపై పర్యావరణ కార్యకర్తలు, స్థానికులు, విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక చిప్కో ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చేలా ఆందోళనకారులు చెట్లను హత్తుకుని, నరికివేత యంత్రాలకు అడ్డంగా నిలబడి వారం రోజులుగా శాంతియుతంగా పోరాటం సాగించారు.
ముఖ్యంగా ఉత్తరాఖండ్ సాంప్రదాయ ప్రకృతి పండుగ అయిన ‘హరేలా’ రోజున పచ్చదనం నింపాల్సిన ప్రభుత్వమే ఇలా వృక్షాలను నాశనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణ సంస్థలు ఈ వేడుకను “బ్లాక్ హరేలా” నిరసన దినంగా మార్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఈ ప్రజా స్పందనపై స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, అన్ని వర్గాల వాటాదారులు, పర్యావరణ నిపుణులు, స్థానిక ప్రజలతో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి, పరస్పర నమ్మకం ఏర్పడే వరకు ఈ చెట్ల నరికివేత ప్రక్రియ నిలిపివేయబడుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి అవసరమే అయినప్పటికీ పర్యావరణాన్ని, ప్రజా సెంటిమెంట్లను విస్మరించలేమని ఆయన ప్రకటించారు.
Read Also: కెన్-బెత్వా ఆందోళనపై పోలీసుల ఉక్కుపాదం!
Follow Us On : WhatsApp

