కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా సంక్షేమ అధికారిని వెంటనే బదిలీ చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భామండ్ల యుగేందర్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రి శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యుగేందర్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రాధిక అవినీతి కేసులో ACB అధికారులకు పట్టుబడి అరెస్ట్ అయ్యారని తెలిపారు. అనంతరం ఆమెను సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కాగా, ఆమెకు అనుకూలంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా సంక్షేమ అధికారిపై ఇప్పటివరకు ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
సీనియర్ అసిస్టెంట్ రాధిక అరెస్టు అయి సస్పెండ్ అయినప్పటికీ, జిల్లా సంక్షేమ అధికారి స్పందించకపోవడం, ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా సంక్షేమ అధికారి అదే స్థానంలో కొనసాగితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున వెంటనే ఆమెను బదిలీ చేయాలని, లేదంటే సస్పెండ్ చేయాలని AIYF జిల్లాప్రధాన కార్యదర్శి భామండ్ల యుగేందర్ డిమాండ్ చేశారు.
గతంలో పనిచేసిన చోట్ల కూడా ఉద్యోగులను వేధిస్తున్నారనే ఆరోపణలతో జిల్లా సంక్షేమ అధికారిని బదిలీ చేసినట్లు తెలిపారు. కరీంనగర్‌లోనూ ఉద్యోగులు గత కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో కలిసి, సదరు అధికారి ఉంటే తాము పనిచేయలేమని ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని అన్నారు. ACB విచారణ సమయంలో కూడా ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా సంక్షేమ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబును కోరారు.

