కలం, స్పోర్ట్స్ : నాలుగున్నరేళ్ల నిరీక్షణ ముగిసింది. ఎన్నో కన్నీళ్లు.. ఎన్నో నిరాశలు. చివరకు రథన్‌వెల్ వీఎస్ (Rathanvel VS) భారత 99వ గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించాడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రథన్‌వెల్.. అస్సాంలో జరిగిన రేటింగ్ టోర్నీలో 2500 ఎలో రేటింగ్ మార్క్‌ను దాటాడు. దీంతో గ్రాండ్‌మాస్టర్ హోదాను అధికారికంగా సొంతం చేసుకున్నాడు. గ్రాండ్‌మాస్టర్ నార్మ్స్‌ను అతడు చాలా ఏళ్ల క్రితమే పూర్తి చేశాడు. కానీ 2500 ఎలో రేటింగ్ మాత్రం అందకుండా పోయింది. అదే అతడిని నాలుగున్నరేళ్ల పాటు వెంటాడింది.
2496, 2497 వరకు వెళ్లి.. ఒక్క విజయంతో లక్ష్యం చేరే దశలో పలుమార్లు ఒత్తిడికి లోనయ్యాడు. గెలవాల్సిన గేమ్‌లను కూడా చేజార్చుకున్నాడు. ఒకసారి పాయింట్లు కోల్పోతే వరుసగా 15 నుంచి 20 పాయింట్లు తగ్గిపోయేవని చెప్పాడు. ఆ పరిస్థితులు తీవ్ర నిరాశకు గురి చేశాయని వెల్లడించాడు. ఇంతలో గాయాలు కూడా అడ్డొచ్చాయి. రెండుసార్లు చేతి ఎముక విరిగింది. కరోనా కారణంగా విదేశీ టోర్నీలు ఆగిపోయాయి. మెకానికల్ ఇంజినీరింగ్ చదువు కూడా చెస్‌కు కొంత దూరం చేసింది.
2025లో అబుదాబిలో డేవిడ్ పరవ్యాన్‌తో జరిగిన మ్యాచ్ అతడిని బాగా బాధించింది. గెలిచే స్థితిలో ఉన్నా.. తప్పిదాలతో మ్యాచ్ చేజారిందని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో చెస్‌కు కొంత విరామం ఇవ్వాలనే ఆలోచన కూడా వచ్చిందని తెలిపాడు. అయినా వెనక్కి తగ్గలేదు. ఈ ఏడాది జూలై 1న 2492 రేటింగ్‌తో అస్సాంకు వెళ్లాడు. అక్కడ తక్కువ రేటింగ్ ఉన్న ఆటగాళ్లతో ఆడిన 10 మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించాడు. కావాల్సిన 8 ఎలో పాయింట్లు సంపాదించి 2500 మార్క్‌ను దాటేశాడు.
రథన్‌వెల్ చెస్ ప్రయాణం కూడా ఆసక్తికరమే. చిన్నప్పుడు హార్లిక్స్ లేదా కాంప్లాన్‌తో ఉచితంగా వచ్చిన చెస్ బోర్డు అతని జీవితాన్ని మార్చింది. అమ్మతో ఆడటం మొదలై.. తర్వాత అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. తన తొలి కోచ్‌లకు ఇప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు. 2019 నుంచి 2025 వరకు ఎంసీపీఎల్ (MPL) స్పాన్సర్‌గా అండగా నిలిచిందని తెలిపాడు. అయితే ఆ మద్దతు తర్వాత ఆగిపోయిందని చెప్పాడు. తన తల్లిదండ్రులు కోయంబత్తూరులో వెడ్డింగ్ కార్డుల వ్యాపారం చేస్తున్నారని వెల్లడించాడు.
వాళ్ల ఆశలే తనను ముందుకు నడిపించాయని తెలిపాడు. గ్రాండ్‌మాస్టర్ హోదా రావడంతో అవకాశాలు పెరుగుతాయని రథన్‌వెల్ భావిస్తున్నాడు. టోర్నీల్లో నిర్వాహకుల దృష్టి పడుతుందని, ఆర్థిక భారం కూడా కొంత తగ్గుతుందని చెప్పాడు. ఆన్‌లైన్‌లో చెస్ కోచ్‌గా పనిచేస్తున్న రథన్‌వెల్.. భవిష్యత్తులో సొంత చెస్ అకాడమీ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన జీవితం మొత్తం చెస్ చుట్టూనే తిరుగుతుందని స్పష్టం చేశాడు.

