కలం వెబ్ డెస్క్ : అంతర్జాతీయ స్థాయిలో పని చేస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠాను ఏపీ సీఐడీ(AP CID) పోలీసులు ఛేదించారు. కంబోడియా(Cambodia) కేంద్రంగా పని చేస్తూ భారత్‌లో సైబర్ నేరాలకు(Cyber Crime) పాల్పడుతున్న పెద్ద నెట్‌వర్క్‌ను గుర్తించారు. ఈ కేసులో వియత్నాం దేశానికి చెందిన హో హుడే అనే యువకుడిని పశ్చిమ బెంగాల్‌లో అరెస్ట్ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు, సైబర్ నేరాలకు ఉపయోగిస్తున్న సుమారు 1400 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కంబోడియాలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి, విశాఖ, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలో ఉన్న సిమ్ బాక్స్ కేంద్రాలకు వాటిని అనుసంధానం చేసినట్లు గుర్తించారు. ఇతరుల ఆధార్, గుర్తింపు పత్రాలతో భారీగా సిమ్ కార్డులు తీసుకొని, సిమ్ బాక్స్‌ల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు వెల్లడించారు. సిమ్ కార్డులు ఏయే ప్రాంతాల నుంచి పని చేస్తున్నాయన్న విషయాలపై సీఐడీ లోతుగా విచారణ జరిపింది. ఈ భారీ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌పై త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని తెలుస్తోంది.


