కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గ (AP Cabinet) సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. రాష్ట్ర ప్రయోజనాలు, పాలనా సంస్కరణలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్కాపురం, పోలవరం ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ప్రకటించే అంశంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. దీనికి తోడు మరికొన్ని కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ ముద్ర వేయనుంది.
రాజధాని అమరావతి పనులను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం నుంచి అందుతున్న సహకారం, నాబార్డ్ ద్వారా సేకరించిన రుణాల వినియోగంపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. త్వరితగతిన మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసేలా కార్యాచరణను ఖరారు చేయనున్నారు. రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా ప్రజలకు అందించే ప్రత్యేక సాయంపై స్పష్టత రానుంది. కొత్తగా రేషన్ కార్డుల జారీ, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానం, ఐటీ పాలసీపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన అనంతరం ప్రభుత్వ ప్రతినిధులు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను అధికారికంగా మీడియాకు వెల్లడించనున్నారు.

Read Also: సరికొత్త రికార్డ్.. 24 గంటల్లో 28.95 కి.మీ రోడ్డు నిర్మాణం, పవన్ హర్షం
Follow Us On : WhatsApp


