పోలీస్ అమరవీరుల సంస్మరణ.. కరీంనగర్‌లో భారీ కొవ్వొత్తుల ర్యాలీ

కలం, కరీంనగర్ బ్యూరో: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల (అక్టోబర్ 21 – అక్టోబర్ 31) ముగింపు సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ (Karimnagar Police) ఆధ్వర్యంలో శనివారం రాత్రి నగరంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ (Candlelight Rally)ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కమిషనరేట్ ఆవరణలోని పోలీస్ అమరవీరుల స్థూపం వరకు సాగింది.

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంతో పాటు ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి, విజయ్‌కుమార్, హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు మత పెద్దలు, పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి అమరులైన పోలీసు వీరులకు ఘన నివాళులర్పించారు.

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి..

ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. ప్రజల శాంతిభద్రతల రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. గత సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 154 మంది పోలీస్ సిబ్బంది వీరమరణం పొందగా, అందులో తెలంగాణ నుంచి ముగ్గురు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు మొత్తం 47 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు.

గత 10 రోజులుగా కార్యక్రమాలు..

సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గత 10 రోజులుగా అమరవీరుల పరేడ్, జిల్లాలోని సుమారు 29 మంది అమరుల కుటుంబాల సభ్యులను పిలిచి సన్మానించడం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, సైకిల్ ర్యాలీ, రక్తదాన శిబిరాలు మరియు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహించామని తెలిపారు.

నిరంతరం శాంతిభద్రతల కోసమే..

పోలీసులు నిరంతరం ప్రజా రక్షణ, శాంతిభద్రతల కోసమే పనిచేస్తున్నారని, ప్రజలు పోలీసులను వ్యతిరేక దృక్పథంతో చూడకుండా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలకు ఖాకీ యూనిఫాం విలువ, గౌరవాన్ని వివరించి భవిష్యత్తులో దేశ రక్షణలో భాగస్వాములయ్యేలా యూనిఫాం సర్వీసుల్లో చేరేందుకు ప్రోత్సహించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అమరులైన పోలీసుల త్యాగాలను స్మరిస్తూ, వారికి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తూ కార్యక్రమాన్ని ముగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>