బాలికలు ఉన్నత స్థాయికి ఎదగాలి: భాస్కర్, సుజాత

కలం, జగిత్యాల: బాలికలు విద్య, ఆరోగ్యం, భద్రతతో పాటు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుజాత సూచించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ధరూర్-లక్ష్మీపూర్‌లోని (Dharur) మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

బాల్య వివాహాలను అంతం చేయడం – బాలికల హక్కులలో పెట్టుబడి పెట్టడం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారి డా. ఏ. భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సుజాత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి నరేంద్ర, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జయరాజ్ హాజరయ్యారు. సఖి కేంద్రం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా సాధికారత సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా.ఏ. భాస్కర్ మాట్లాడుతూ.. విద్యార్థినులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదవాలని, అపజయాలకు భయపడకుండా పట్టుదలతో ముందుకు సాగి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. డా. సుజాత మాట్లాడుతూ.. బాలికలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు వినియోగించాలని, నులిపురుగుల నివారణ, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ అధికారి జయరాజ్ మాట్లాడుతూ.. విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వసతి గృహాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం డీసీపీయూ, హెచ్‌యూబీ సఖి కేంద్రం సిబ్బంది బాలల హక్కులు, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ, పోక్సో చట్టం, బాలికల భద్రత, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, పోలీస్ 100, అంబులెన్స్ 108, అత్యవసర సేవలు 112, టెలీ మానస్ 14416 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఈ సందర్భంగా భాగంగా వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. బాలికల హక్కులు, విద్య, సాధికారతకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికల్లో విద్య, ఆరోగ్యం, భద్రత, హక్కులు, సాధికారతపై అవగాహన పెంపొందించడంతో పాటు బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సందేశాన్ని అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>