కలం, వెబ్‌డెస్క్: చిన్నపిల్లల్లో రక్తహీనత (Anemia in Children) అనేది ప్రస్తుతం అనేకమంది పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి అవసరమైన రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ శాతం సాధారణ స్థాయి కంటే తగ్గడాన్ని రక్తహీనత అంటారు. శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అత్యంత అవసనమైన ఇనుము లోపించడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల ఆహారంలో ఇనుముతో పాటు విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాల లోపం కూడా రక్తహీనతకు దారితీస్తోందట.
రక్తహీనతకు గల కారణాలు
1. కడుపులో నులిపురుగులు: నులిపురుగులు పిల్లలు తినే ఆహారంలోని పోషకాలను, రక్తాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉందంటున్నారు.
2. జీర్ణక్రియ లోపాలు: సెలియాక్’ (Celiac) లేదా ‘క్రోన్స్’ (Crohn’s) వంటి ప్రేగుల వ్యాధుల రావడం వల్ల శరీరం ఐరన్‌ను గ్రహించలేదు. శరీరం ఐరన్‌ను గ్రహించకపోతే రక్తహీనత తలెత్తుతుంది.
3. తరచూ ఇన్ఫెక్షన్లు: పిల్లలు తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం. మలేరియా, టీబీ, లేదా కిడ్నీ సమస్యల వంటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల రక్తహీనత పెరుగుతుంది.
4. నెలలు నిండకుండా పుట్టడం (Premature Birth): గర్భంలో ఉన్న ఆఖరి నెలల్లోనే శిశువుకు తల్లి నుండి ఐరన్ నిల్వలు అందుతాయి. ముందే పుట్టడం వల్ల ఈ నిల్వలు సరిపోవు. దీనివల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది.
5. తక్కువ బరువు (Low Birth Weight): పుట్టినప్పుడు తక్కువ బరువు ఉన్న పిల్లల్లో సహజంగానే ఐరన్ నిల్వలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
అందువల్ల ఇటువంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
తొలి దశలో కనిపించే లక్షణాలు
1. చర్మం పాలిపోవడం: ముఖం, అరచేతులు, గోర్లు, కళ్ళు తెల్లగా లేదా పాలిపోయినట్లు (Pale skin) మారుతాయి.
2. పెదవుల రంగు మారడం: పెదవులు, నాలుక సహజమైన గులాబీ రంగును కోల్పోతాయి.
3. తీవ్ర నీరసం: పిల్లలు ఉదయం లేచినప్పటి నుంచే ఎలాంటి ఉత్సాహం లేకుండా, బద్ధకంగా కనిపిస్తారు.
4. త్వరగా అలసిపోవడం: కొద్ది దూరం నడిచినా లేదా చిన్న చిన్న పనులు చేసినా అలసట చెందుతారు.
5. ఆటలపై ఆసక్తి తగ్గడం: ఎప్పుడూ ఉత్సాహంగా ఆడుకునే పిల్లలు, ఆటపాటలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
6. చిరాకు, ఏడుపు: చిన్న విషయాలకే కోప్పడటం, మారాం చేయడం లేదా చిరాకు పడటం చూస్తాము.
7. ఆకలి మందగించడం: అన్నం తినడానికి అస్సలు ఇష్టపడరు, దీనివల్ల బరువు కూడా తగ్గుతారు.
8. ఏకాగ్రత లోపించడం: చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. బడిలో పాఠాలను సరిగ్గా అర్థం చేసుకోలేరు, జ్ఞాపకశక్తి మందగిస్తుంది.
రక్తహీనత తీవ్రత పెరిగిన పిల్లలకు మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గడం వలన తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారను నిపుణులు.
నివారణ మార్గాలు, సంరక్షణ
- పిల్లలలో రక్తహీనత తగ్గించేందుకు ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారం పదార్థాలు ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లల డైలీ రోటీన్‌లో ఆకుకూరలు, మాంసాహారం, పప్పులు, ధాన్యాలు, డ్రైఫ్రూట్స్ వంటి ఐరన్ ఉండే ఆహార పదార్థాలను జోడించాలి.
- అంతేకాకుండా పిల్లలు తీసుకున్న ఐరన్ శరీరం గ్రహించాలంటే విటమిన్ సి చాలా ముఖ్యం. అందుకే పిల్లలకు నారింజ, బత్తాయి, జామపండు, కివి, స్ట్రాబెరీ వంటి పండ్లను ఇవ్వాలి. వీటిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది.
- ఆహారంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కూడా చాలా ముఖ్యమని సూచిస్తున్నారు నిపుణులు. దీని వల్ల ఇన్ఫెక్షన్లు, నులిపురుగుల సమస్యను నివారించవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ, నిపుణుల సలహా మేరకు నడుచుకోవడం ద్వారా పిల్లలలో రక్తహీనతను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

