కలం, వెబ్ డెస్క్ : గుజరాత్‌లోని వడోదర (Vadodara) సమీపంలో తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వడోదర-హాలోల్ రోడ్డులోని కోటంబి గ్రామం వద్ద నిలిపి ఉంచిన ఒక ట్రక్కును ప్రైవేట్ లగ్జరీ బస్సు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
నిద్రలో ఉండగానే ముంచేసిన మృత్యువు
తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో బస్సులోని ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు ఒక్కసారిగా ట్రక్కును ఢీకొట్టడంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సుమారు 20 నుండి 40 మంది ప్రయాణికులు బస్సు క్యాబిన్ లోపల చిక్కుకుపోయారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే జరోద్, కోటంబి గ్రామస్థులు, స్థానిక సర్పంచ్‌లు అనిల్ సోలంకి, అరవింద్ సోలంకి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 10 అంబులెన్స్‌ల సహాయంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయని, కానీ ఇంతటి తీవ్రమైన ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

