కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందిరా గాంధీ వర్ధంతి, వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ చిన్నతనం నుంచే దేశభక్తి, నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారన్నారు. ఆమెను ప్రపంచం మొత్తం భారత ఉక్కు మహిళ అని పిలుస్తుందని చెప్పారు. 1966లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిర క్లిష్ట సమయాల్లో ధైర్యమైన విప్లవాత్మక, చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని అన్నారు. సామాన్య ప్రజలకు, రైతులకు బ్యాంకింగ్ సేవలు అందించడానికి బ్యాంకులను జాతీయం చేశారని కొనియాడారు.
పాకిస్తాన్‌పై విజయం సాధించి, బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం తెచ్చిపెట్టడంలో ఇందిరా గాంధీ దౌత్యం, ధైర్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు. “నా రక్తంలో ప్రవహించే ప్రతి బొట్టు ఈ దేశాన్ని బలపరచడానికి, ఏకీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది” అన్న మాటల ప్రకారమే 1984 అక్టోబర్ 31న దేశ సమగ్రత కోసం తన ప్రాణాలనే అర్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఏఐసీసీ కో ఆర్డినేటర్ గన్ రాజ్, జిల్లా ఉపాధ్యక్షులు కౌదపు శరత్, నగర ఉపాధ్యక్షుల అంతరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, జిల్లా ఎస్టీ అధ్యక్షులు యాదగిరి, బంటు బలరాం, మహిళా నాయకులు పోలా ఉష,చంద్రకళ, విజయలక్ష్మి, స్వప్న, ఆమరాజు, ఆకుల రాజు, పోలా శంకర్, ఆదే ప్రవీణ్, తదితరుల పాల్గొన్నారు.

