200కు పైగా ఇళ్లలో పోలీసుల తనిఖీలు.. 28 వాహనాలు స్వాధీనం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరాల నివారణతో పాటు ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని మరింత పెంపొందించడమే లక్ష్యంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ శాఖ కమ్యూనిటీ కనెక్టింగ్ పోలీసింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచారం (Macharam) గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ (Cordon and Search) ఆపరేషన్ నిర్వహించారు.

200కు పైగా ఇళ్లలో తనిఖీలు..

ఈ సందర్భంగా పోలీసు అధికారులు గ్రామంలోని 200కు పైగా ఇళ్లను సందర్శించి నివాసితుల వివరాలు, గుర్తింపు కార్డులు, ఇతర అధికారిక ధ్రువపత్రాలను పరిశీలించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. తనిఖీల్లో భాగంగా సరైన వాహన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఒక ఆటోను గుర్తించి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత వాహన యజమానులు అవసరమైన ధ్రువపత్రాలను చూపించి వాహనాలను తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. అదేవిధంగా గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై తనిఖీలు నిర్వహించగా 36 బీర్ బాటిళ్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కేసులు నమోదు చేశారు.

కమ్యూనిటీ పోలీసింగ్‌తో ప్రజలకు భద్రత

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్ అనేది కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా పోలీసులకు, ప్రజలకు మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమమని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో నేరాలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి అరికట్టడం, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

వాహనదారులకు ఎస్పీ హెచ్చరిక

ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వాహనదారులు ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ధ్రువపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల కార్యకలాపాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినప్పుడు ప్రజలు నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి..

అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులు క్లిక్ చేయడం, ఓటీపీలు ఇతరులకు చెప్పడం, బ్యాంకు ఖాతా వివరాలు పంచుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రమణ రెడ్డి, జడ్చర్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ కమలాకర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>