కలం, వెబ్ డెస్క్ : మండే వేసవిలో వాతావరణ శాఖ (Weather Update) చల్లని కబురు అందించింది. ఆవర్తన ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని వల్ల తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న వేళ ఈ వార్త ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది.
మరోవైపు దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వెదర్ రిపోర్ట్ వెల్లడించింది. పల్నాడు జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అమరావతిలో 41.7 డిగ్రీలు రికార్డు అయ్యాయి. నందిగామలో 41.6 డిగ్రీలు, కావలిలో 41.4, విజయవాడలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓ వైపు ఠారెత్తించే ఎండలు, మరోవైపు వర్షాల సూచనతో రాష్ట్రంలో వాతావరణం మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

