కలం వెబ్ డెస్క్ : మంచిర్యాల(Mancherial) జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పలువురు పీఠాధిపతులు, స్వాముల సూచన మేరకు గోదావరి ఒడ్డున జరిపిన తవ్వకాల్లో దుర్గామాత విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు నిర్మాణుష్యంగా ఉన్న ఆ ప్రాంతమంతా ఇప్పుడు భక్తులతో కిక్కిరిసిపోయింది. జనం తాకిడిని పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది.
గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా అయోధ్య శ్రీరామమందిర పూజారి సహా వారణాసి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు పీఠాధిపతులు, స్వాములు డిసెంబర్ 12న మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ముల్కల గ్రామంలో గోదావరి నది వద్ద గ్రామస్తులతో మాట్లాడారు. ఈ ప్రదేశంలో ఏదో తెలియని శక్తి ఉందంటూ ప్రజలతో చెప్పారు. ఇక్కడ తవ్వకాలు చేపడితే ఆ శక్తిని బయటకు తీయవచ్చన్నారు. అది ప్రైవేటు భూమి కావడంతో సదరు భూ యజమానితో చర్చలు జరిపి ఆయన అనుమతి తీసుకున్నారు. అనంతరం ఆ భూమిలో పీఠాధిపతులు, స్వాములు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రదేశాల నుంచి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. జేసీబీలతో తవ్వకాలకు ముందు పూజలు చేస్తున్నప్పుడే పలువురు భక్తులకు పూనకాలు రావడం మరింత ఉత్కంఠను రేపింది. తవ్వకాల అనంతరం భూమిలో సింహంపై కూర్చున్న దుర్గామాత విగ్రహం లభ్యమైంది.
దీంతో అక్కడి ప్రాంతమంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోయింది. తమ గ్రామంలో అమ్మవారి విగ్రహం ప్రత్యక్షమవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. మరో విజయవాడగా ముల్కల గ్రామం విరాజిల్లుతుందని స్వాములు చెప్పినట్లు వెల్లడించారు. మంచిర్యాల(Mancherial) పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ఈ ప్రదేశంలో గతంలో దేవాలయం ఉన్నట్లు స్వాములు చెబుతున్నారు. స్వాముల సూచన మేరకు స్థానికంగా తవ్వకాలు కొనసాగిస్తారా? లేదా ఇంతటితో ఆపేస్తారా? అనేది వేచి చూడాలి.
Read Also: అకిరా ఎంట్రీ ఎప్పుడు..? ఎవరితో..?
Follow Us On: Pinterest


