కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ విజన్ అద్భుతంగా ఉందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ సమగ్ర డాక్యుమెంట్‌లా అనిపించిందని పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో విజన్ డాక్యుమెంట్ విడుదల సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి దిశ, యువత మహిళల భాగస్వామ్యం, రంగాలవారీగా ప్రతిపాదించిన వ్యూహాలు ఇవన్నీ ఈ విజన్ పత్రంలో సమగ్రంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఇదో పత్రం కాదు.. ప్రజల ఆకాంక్ష
“విజన్ డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివాను. ఇది ఒక ప్రభుత్వ పత్రం మాత్రమే కాదు. నిజంగా ప్రజల ఆకాంక్షల ప్రతిబింబంలా ఉంది. ఇంత స్పూర్తిదాయక విజన్ రూపొందించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు” అని మహీంద్రా అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా తనను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారని చెప్పారు. ‘నేను ఇప్పటికే టెక్ మహీంద్రా యూనివర్సిటీకి చైర్మన్‌గా ఉండటంతో మొదట నిరాకరించాను. కానీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లక్ష్యాలు, విజన్, ఆలోచనలు విన్నాక తిరస్కరించే ప్రశ్నే రాలేదు” అని మహీంద్రా అన్నారు. నాలుగు దశాబ్దాల వ్యాపార అనుభవం ఉన్న తనకు రేవంత్ రెడ్డి సమఉజ్జీ అయిన నాయకుడిలా అనిపించారని, ఆ దార్శనికతే విజన్–2047కి బలమని పేర్కొన్నారు.
మహిళల స్కిల్ కు ప్రత్యామ్నాయం లేదు…
“ఏఐ వచ్చినా… మహిళల చేతుల్లో ఉన్న స్కిల్‌కు ప్రత్యామ్నాయం లేదు” అని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పేర్కొన్నారు. డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా ఎదిగినా మహిళల చేతుల్లో ఉన్న నాణ్యత, నిబద్ధత, ‘హ్యూమన్ టచ్’ కు సమానమైనది ఏ టెక్నాలజీ చేయలేదని అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మహిళలు నడుపుతున్న బ్యాటరీ తయారీ యూనిట్ తనకు, మహీంద్రా గ్రూప్‌కు గర్వకారణమని చెప్పారు. పరిశ్రమల్లో మహిళల భాగస్వామ్యాన్ని తెలంగాణ మరింత పెంచుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటుందని, పరిశ్రమలు, ఇన్నోవేషన్ స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో ఈ విజన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
Read Also: భారత్‌లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి: సత్య నాదెళ్ల
Follow Us On: Instagram


