కలం, వెబ్ డెస్క్: తరచి చూడాలేకానీ హైదరాబాద్‌లో గొప్ప పర్యాటక ప్రాంతాలు, చారిత్రాత్మకమైన ప్రదేశాలతోపాటు వావ్ అనిపించే అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. హాయిని గొలిపే సరస్సులున్నాయి. ముఖ్యంగా వింటర్ సీజన్‌లో భాగ్యనగరంలో వలస పక్షులు సందడి చేస్తాయి. నిర్మలమైన ఆకాశం.. లేలేత భానుడి కిరణాలు ప్రసరిస్తున్న వేళ.. సరస్సుల్లో సందడి దృశ్యాలు ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ సీజన్‌లో ఎన్నో మైళ్ల దూరం వచ్చిన ఫ్లెమింగోస్ (Flamingos) ఇక్కడ వాలిపోతాయి.
హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్టారెడ్డిపేట సరస్సు చాలా మందికి తెలియదు. ప్రశాంతమైన వాతావరణం, జలసవ్వడి, పక్షుల కిలకిలారావాలతో మైమరిచిపోయేలా చేస్తుంది. అక్కడికి అడుగుపెడితే చాలు.. విశాలమైన ఆకాశం, ఎటుచూసినా పచ్చదనం, అనేక రకాల పక్షులు కనిపిస్తాయి. హైదరాబాద్ చుట్టుపక్కల పక్షులను చూసే బర్డ్స్ లవర్స్‌కు, ఫోటోగ్రాఫర్లకు ఈ సరస్సు డెస్టినేషన్‌గా మారింది. ఈ సీజన్‌లో వెళ్తే ఫ్లెమింగోలను చూడొచ్చు.
కిష్టారెడ్డిపేట సరస్సు తెలంగాణలోని సంగారెడ్డి శివార్లలోని అమీన్‌పూర్ సమీపంలో ఉంది, హైదరాబాద్ నుంచి క్యాబ్ లేదా సొంత వాహనం ద్వారా వెళ్లొచ్చు. గంటకుపైగా సమయం పడుతుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు అనేక వలస పక్షులు సందడి చేస్తాయి. తెల్లవారుజామున, సూర్యోదయ సమయంలో ఇక్కడి పరిసరాలు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఫ్లెమింగ్‌లు ఆహారం తీసుకోవడం, ఎగరడం, నీటి దగ్గర గుమిగూడటం లాంటి దృశ్యాలు వావ్ అనిపించేలా ఉంటాయి.


