కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల నిత్యావసర ధరలు పెరుగుతాయని బెంబేలెత్తిపోతున్న సామాన్య ప్రజలకు పిడుగులాంటి వార్త అందింది. ప్రముఖ డెయిరీ దిగ్గజం అమూల్ పాల ధరలను (Amul Milk Price) పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 మేర ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) వెల్లడించింది. ఈ ధరల పెంపు మే 14 నుంచే అమలులోకి వస్తాయని పేర్కొంది.
దీని ప్రకారం.. అముల్ గోల్డ్ (ఫుల్ క్రీమ్) అర లీటర్ (500ml) ప్యాకెట్ ధర రూ.35 , లీటర్ ధర రూ.70కి చేరింది. అలాగే అముల్ తాజా (టోన్డ్ మిల్క్) ధర అర లీటర్ ధర రూ.30, లీటర్ ధర రూ.58కి ఎగబాకింది. మరోవైపు అముల్ ఆవు పాలు అర లీటర్ ప్యాకెట్ ఇప్పుడు రూ.31కి లభించనుండగా.. అముల్ గేదె పాలు అర లీటర్ ప్యాకెట్ ధర రూ.38కి పెరిగింది. పశువుల మేతతో పాటు ప్యాకేజింగ్ ఖర్చులు, రవాణా (ఇంధన) వ్యయం కూడా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది.

