Mobile Popup Ad
Mobile Popup Ad

మావోయిస్టు పార్టీపై కీలక తీర్మానం.. లోక్‌సభలో అమిత్ షా వివరణ

కలం, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు (Maoist Party) పార్టీని అంతమొందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతున్నది. మరో మూడు రోజుల్లో ఆ గడువు పూర్తికానున్నది. మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని ప్రధాని మోడీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటన చేశారు. దానికి వీలుగా 2024 జనవరి ఫస్ట్ నుంచి ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) మొదలుపెట్టింది. వేలాది మంది మావోయిస్టు లీడర్లు, కేడర్ లొంగిపోయారు. వందలాది మంది ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఇప్పటికీ పలువురు నేతల జాడ తెలియలేదు. వారి కోసం దండకారణ్యంలోని పలు అటవీ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ తదితర కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పార్లమెంటులో హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వనున్నారు.

ఒక రోజు ముందే లోక్‌సభలో చర్చ :

‘మావోయిస్టు పార్టీ ముక్త్ భారత్’ నినాదంతో ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం రెండేండ్లలో సాధించిన ప్రగతిని పార్లమెంటులో వివరించనున్నది. లోక్‌సభ సభ్యులు శ్రీకాంత్ ఏక్‌నాధ్ షిండే, బైరెడ్డి శబరి స్వల్పకాలిక చర్చకు స్పీకర్‌కు నోటీసులు ఇచ్చారు. రూల్ 193 ప్రకారం డిబేట్ నిర్వహించాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ ఓం బిర్లా ఈ నెల 30న చర్చకు టేకప్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆ మేరకు లోక్‌సభ బిజినెస్ షెడ్యూలులోనూ సమాచారం ఇచ్చారు. వామపక్ష తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తి చేయడంపై చర్చ జరగాలన్న అంశంలో భాగంగా మావోయిస్టు పార్టీని తుదముట్టించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ 27 నెలల కాలంలో సాధించిన పలితాలను కేంద్ర హోం మంత్రి హోదాలో అమిత్ షా వివరణ ఇవ్వనున్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున మావోయిస్టు పార్టీ అంతమైనట్లుగా ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభ్యులందరి ఆమోదం పొందేలా ప్లాన్ చేస్తున్నట్లు లోక్‌సభ వర్గాల సమాచారం.

రెండు రోజుల్లో ఏం జరగనున్నది? :

కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా పెట్టుకున్న డెడ్‌లైన్ మార్చి 31తో ముగుస్తున్నందున కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఆసక్తికరంగా మారనున్నది. ఇప్పటికీ మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి సహా పలువురి ఆచూకీ తెలియకపోవడంతో ఆ లోగా వారిని కూడా పట్టుకుంటారా?.. లేక వారంతట వారు సరెండర్ అయినట్లుగా ప్రకటన వెలువడుతుందా?.. లేక మరికొన్ని రోజులు ఈ ఆపరేషన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటన చేస్తారా?.. ఇలాంటి సందేహాలు వెలువడుతున్నాయి. గణపతితో పాటు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా అలియాస్ భాస్కర్, తెలంగాణకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి అలియాస్ విశ్వనాధ్, తెలంగాణకు చెందిన పలువురు రాష్ట్రకమిటీ సభ్యులు జార్ఖండ్‌లోని సరబందా అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ రెండు రోజుల్లోనే వారికి సంబంధించిన సమాచారం వెలుగులోకి వస్తుందన్నదని కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>