కలం, వెబ్ డెస్క్: ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం తమకు తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు (ASHA Workers) నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చారు. ముందుగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. పోలీసులు ఆశా కార్యకర్తల ధర్నాను అడ్డుకొని అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ధర్నాకు అనుమతి ఉందని, పోలీసులు శాంతియుత నిరసనలపై ఇలా వ్యవహరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తమకు రూ.18 వేలు వేతనం చెల్లించాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు కూడా చేశారు. కరీంనగర్ నుంచి చలో అసెంబ్లీకి బయల్దేరిన ఆశా వర్కర్లను రేణికుంట టోల్‌గేట్ దగ్గర అడ్డుకున్నారు. బస్సు దింపేయడంతో పోలీసులపై ఆశావర్కర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా అని మండిపడ్డారు. ప్రతి చిన్న పనులకు ప్రభుత్వం తమ సేవలను వినియోగించుకుంటుందని, కానీ సమస్యలపై మాత్రం ఏమాత్రం దృష్టి పెట్టరని మండిపడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఆశా కార్యకర్తలు చేపట్టిన నిరసన తీవ్ర ఆందోళనకు దారితీసింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. అసెంబ్లీ వద్దకు వచ్చిన కొందరు ఆశా వర్కర్లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

