కలం, వెబ్ డెస్క్: ముంబై మెట్రో (Mumbai Metro)లో ప్రయాణించిన ఒక అమెరికన్ టూరిస్ట్ (American Tourist) స్థానిక రవాణా వ్యవస్థ పని తీరును ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ముంబై మెట్రో ఎక్స్‌పీరియెన్స్ (Mumbai Metro experience) పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో లిజ్ అనే మహిళ తొలిసారి ముంబై మెట్రోలో ప్రయాణించారు. కేవలం రూ.20 కే లభించే టికెట్, మెట్రో స్టేషన్ పరిశుభ్రత, ప్రయాణికుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్క్రీన్ డోర్స్ ఆమెను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. ముంబైలో వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లోపల ఏసీతో చల్లగా అనిపించిందని ఆమె చెప్పారు.
న్యూయార్క్ మెట్రోతో పోలిస్తే ముంబై మెట్రో ఎంతో శుభ్రంగా ఉందంటూ లిజ్ కొనియాడారు. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా కేటాయించిన మహిళల కంపార్ట్‌మెంట్ ఫీచర్‌ను ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. తాను ఇప్పటి వరకు సందర్శించిన ఏ ఇతర దేశాల్లోనూ ఇలాంటి సదుపాయాన్ని చూడలేదని చెప్పుకొచ్చారు. ఆధునిక ప్రజా రవాణా మౌలిక సదుపాయాల కల్పనలో అమెరికా ఖచ్చితంగా భారతదేశం నుండి పాఠాలు నేర్చుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భారతీయ రవాణా వ్యవస్థలోని ఇలాంటి పాజిటివ్ విషయాలు చాలా అరుదుగా వైరల్ అవుతుంటాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముంబైకి స్వాగతం పలుకుతూ ఆమె ఇండియా టూర్ ఇలాంటి మరెన్నో మెమొరీస్‌తో సాగాలని ఆకాంక్షించారు. ఇక కొందరు ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో వ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచిన ఢిల్లీ మెట్రోను కూడా ఒకసారి సందర్శించాలంటూ ఆమెకు సూచించారు. కొందరు ఫన్నీగా ముంబై లోకల్ ట్రైన్లలో కూడా ఒక సారి జర్నీ చేసి చూడాలంటూ కామెంట్లు చేశారు.

