కలం, వెబ్ డెస్క్ : లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ టార్గెట్‌గా భారత్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఆర్చరీ గేమ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. భారత కాంపౌండ్ ఆర్చరీ చీఫ్ కోచ్‌గా అమెరికా దిగ్గజం డేవ్ కజిన్స్ (Dave Cousins )ను నియమించింది. ఎన్నో సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన కజిన్స్.. రానున్న రెండు వారాల్లో భారత కోచ్‌గా పట్టాలు అందుకోనున్నాడు. కజిన్స్‌కు తొలి అసైన్‌మెంట్‌గా వచ్చే నెల టర్కీలోని అంతాల్యాలో జరిగే స్టేజ్-3 ఆర్చరీ వరల్డ్ కప్ ఉండనుంది. ఈ టోర్నీ నుంచే భారత జట్టుతో అతని ప్రయాణం ప్రారంభం కానుంది.
ఈ నియామకం భారత ఆర్చరీకి కీలక మలుపుగా భావిస్తున్నారు. ఎందుకంటే లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌లో తొలిసారి కాంపౌండ్ ఆర్చరీకి చోటు దక్కింది. ఇందులో కేవలం మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ మాత్రమే ఉండనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంపై ఆసక్తి పెరిగింది. 49 ఏళ్ల డేవ్ కజిన్స్‌కు ఆర్చరీలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. తన కెరీర్‌లో అనేక ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిళ్లు గెలుచుకుని కాంపౌండ్ ఆర్చరీ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇది అతనికి తొలి అంతర్జాతీయ కోచింగ్ బాధ్యత అయినప్పటికీ.. అమెరికాలోని పలు క్లబ్‌లు, స్టేట్ టీమ్‌లతో కలిసి పనిచేసి మంచి కోచింగ్ అనుభవాన్ని సంపాదించాడు. భారత ఆర్చరీ సంఘం కూడా కజిన్స్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని నమ్ముతోంది. అతని టెక్నికల్ నాలెడ్జ్, వ్యూహాత్మక ఆలోచనలు భారత కాంపౌండ్ ఆర్చరీ స్థాయిని మరింత పెంచుతాయని భావిస్తోంది. గత కొన్నేళ్లుగా భారత కాంపౌండ్ ఆర్చర్లు అంతర్జాతీయ వేదికపై మెరుగైన ప్రదర్శనలు ఇస్తున్నారు.
ఇప్పుడు కజిన్స్ లాంటి కోచ్ రావడంతో జట్టుకు మరింత బలం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఒక్క మిక్స్‌డ్ టీమ్ గోల్డ్ మాత్రమే అందుబాటులో ఉండటంతో.. ప్రతి దేశం ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన సన్నాహాలను వేగవంతం చేసింది.

