Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్‌ఎస్ ప్రవీణ్ బాధ్యతాయుతంగా మాట్లాడాలి : వేముల వీరేశం

కలం, నల్లగొండ : మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడటం మానుకుని, వాస్తవాలను గుర్తించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) సూచించారు. ఆనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ శాంతిభద్రతలపై, ప్రజాస్వామ్య పరిస్థితులపై ఎన్నో విమర్శలు చేసిన ప్రవీణ్ కుమార్.. నేడు అవన్నీ మర్చిపోయినట్లు మాట్లాడుతుండటం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పిందని స్పష్టం చేశారు. నేడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం కల్పించబడిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తివేసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే.. నేడు తమ ప్రభుత్వం ధర్నా చౌక్‌ను పునరుద్ధరించి ప్రజల హక్కులను కాపాడిందని ఆయన పేర్కొన్నారు. ”గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ‘గడీల పాలన’ అంటూ తీవ్ర విమర్శలు చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. మళ్లీ అదే పార్టీలో చేరి దళితుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కుటుంబం వద్ద తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని వేముల వీరేశం ప్రశ్నించారు. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా ఆయన బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు.

బండి బగీరథ్ వివాదంపై స్పందిస్తూ.. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని, చట్టప్రకారం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అసత్య ప్రచారాలతో తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. తెలంగాణ పోలీసులపై అనవసర విమర్శలు చేయడం తగదని వీరేశం పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక మోడల్‌గా నిలిచాయని, వాటి పనితీరు మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని కొనియాడారు. తమ ప్రభుత్వం ఎవరిపైనా పక్షపాతం లేకుండా, పూర్తి న్యాయబద్ధంగా చట్ట ప్రకారం వ్యవహరిస్తోందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>