కలం, వెబ్‌డెస్క్: ఏపీకి భారీ పెట్టుబడులు తీసుకురావడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) ఇతర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ఎస్ఐపీబీ ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 282 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని సీఎం వెల్లడించినట్లు కందుల దుర్గేశ్ తెలిపారు. అందులో 114 ప్రాజెక్టులు ఇప్పటికే గ్రౌండింగ్ దశకు చేరినట్లు మంత్రి లోకేశ్ చెప్పారన్నారు.
విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన పెట్టుబడి ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, అత్యంత వేగంగా అమలులోకి రావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు, భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రాజెక్టుల అమలు ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని, రాష్ట్రానికి పారిశ్రామిక కళ తీసుకురావడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

