కలం, వెబ్ డెస్క్ :అమరావతికి చట్టబద్ధత కల్పించడం ప్రజల విజయమని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. శుక్రవారం సీఎం మీడియాతో మాట్లాడుతూ… అమరావతిని రాజధానిగా నిర్ణయించి 12 ఏళ్లయ్యిందని.. చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. అమరావతికి పార్లమెంట్ చట్టబద్దత కల్పించడం హర్షణీయమని, దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లును సమర్థించాయని వెల్లడించారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం.. విభజన సమయంలో ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరానని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే దేశం మొత్తం అమరావతి వైపు నిలిచింది.. అమరావతి గెలిచిందన్నారు. రాజధానిని నిర్మించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడించారు.
రాజధానికి అమరావతి అనుకూలం..
రాజధానికి అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం అమరావతి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి మధ్యలో అమరావతి ఉంటుందని గుర్తు చేశారు. సింగపూర్ ను మించిన రాజధాని కడతామని చెప్పానని, ఒక్క పైసా తీసుకోకుండా సింగపూర్ ప్రభుత్వం రాజధానికి మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని వివరించారు. అయితే అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు.. వైసీపీ అనేక వేషాలు వేసిందని విమర్శలు గుప్పించారు.భూములు ఇవ్వకుండా రైతులను రెచ్చగొట్టారు. ఈ ప్రాంతాన్ని ఎడారి అన్నారు. కులం రంగు పులిమారని విమర్శించారు. అమరావతి వల్ల ఏం లాభమని వైసీపీ సహా కొందరు ప్రశ్నిస్తున్నారని సీఎం అన్నారు. గతంలో సైబరాబాద్ విషయంలోనూ ఇలాగే అన్నారని.. ఇప్పుడు అదే సైబరాబాద్ హైదరాబాద్ అభివృద్ధిలో కీలకంగా మారిందని వెల్లడించారు. దేశ భవిష్యత్ కోసం ఓ మంచి నగరం అవసరం అని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే సరికొత్త కాన్సెప్ట్
రాజధాని కోసం ప్రపంచంలోనే సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలోనే 11 నెలల్లోనే సచివాలయం నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. అయితే అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలని హేళన చేసిన వైసీపీ సైతం ఇక్కడి నుంచే పాలన కొనసాగించిందని పేర్కొన్నారు. కాగా, అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం లేదన్నారు. తిరుపతి, విశాఖను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
వైసీపీ మావిగన్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్
మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన వైసీపీ ఇప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బీ అంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారని చంద్రబాబు తెలిపారు. మావిగన్ అంటూ ఏవేవో చెబుతున్నారని .. వాటిని పలకడం తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. దేశమంతా అమరావతిని నిలబెట్టేందుకు మద్ధతిస్తే వాళ్లను తప్పుబడుతున్నారని మండిపడ్దారు. దేశం మొత్తానిది ఒక దారైతే… తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని సీఎం విమర్శించారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. తమకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని ఆరోపించారు.
రాజధానిని పదే పదే మార్చడంపై స్పందన
రాజధానిని పదే పదే మార్చుకునే హక్కు ఎవరికీ లేదని సీఎం చంద్రబాబు స్పష్ఠం చేశారు. అమరావతిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని.. అమరావతి ప్రజా రాజధానిగా రూపుదిద్దుకోనుందని వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. అమరావతి పేరు పలికేందుకు వైసీపీ ఎందుకంత ద్వేషం అని మండిపడ్డారు. అమరావతి ఎప్పటికీ పూర్తవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారన్న సీఎం.. రాజధాని నిర్మాణం అన్నది నిరంతర ప్రక్రియ అని, రాజధానిపై కొంత ఖర్చు చేసిన తర్వాత దీని నుంచి కొంత ఆదాయం వస్తుందని చెప్పారు. కీలకమైన పనులు 2028 నాటికి పూర్తవుతాయని చెప్పారు. 2028లో కీలక నిర్మాణాలను ప్రధాని మోదీతో ప్రారంభించేలా ప్లాన్ చేశామని వివరించారు.

