మొబైల్ ఫోన్లో ఒక్క నెంబర్ మార్చారంటే మూడు సంవత్సరాలు జైలుకు వెళ్లాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా రూ.5 కోట్ల జరిమానా కూడా పడొచ్చని వివరిస్తున్నారు. ఇంతకీ ఆ నెంబర్ ఏంటనా మీ సందేహం.. అదే ఐఎంఈఐ నెంబర్(IMEI Number). సెల్‌ఫోన్‌లను గుర్తించేందుకు ఉపయోగించే 15 అంకెల ఐఎంఈఐ (International Mobile Equipment Identity) నంబర్‌ను మార్చడం వంటి చర్యలు బెయిలబుల్ నేరమే అయినప్పటికీ ఇకపై దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించడం జరుగుతుందని టెలికాం శాఖ (DoT) సోమవారం ప్రకటించింది. ఇటువంటి నేరాలు చేసిన వారికి గరిష్టంగా మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ. ఐదు కోట్ల రూపాయల వరకు జరిమానా లేదా రెండింటినీ కలిపి విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఐఎంఈఐ కి సంబంధించిన చట్టాలను ఖచ్చితంగా పాటించాలని మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు, బ్రాండ్ యజమానులు, దిగుమతిదారులు, రిటైలర్లకు డాట్ ఆదేశాలు జారీ చేసింది. మార్పులు చేసిన ఐఎంఈఐతో ఉన్న ఫోన్లు, మోడెమ్లు, మాడ్యూల్స్ లేదా సిమ్‌బాక్స్‌లు ఉద్దేశపూర్వకంగా కలిగి ఉండడం కూడా నేరమని ఆ శాఖ స్పష్టం చేసింది. అలాగే, ఐఎంఈఐ నంబర్లను(IMEI Number) మార్చడానికి ఉపయోగించే పరికరాలు లేదా సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉండడం టెలికాం సైబర్ సెక్యురిటీ నియమాలకు వ్యతిరేకమని పేర్కొంది.
భారతదేశంలో తయారు చేసే లేదా విక్రయించే ప్రతి మొబైల్ పరికరం ఫోన్, మోడెమ్, మాడ్యూల్, సిమ్‌బాక్స్‌ల ఐఎంఈఐ నంబరు ప్రభుత్వంతో తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపింది. దిగుమతిదారులు కూడా తమ పరికరాలను డివైస్ సెతు పోర్టల్ ద్వారా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: హిడ్మాతో పాటు చనిపోయింది వీరే…
Follow Us on: Youtube

