పోషకాహారం తింటున్నా లోపం తగ్గట్లేదా? అసలు కారణం ఇదే!

కలం, వెబ్ డెస్క్: మంచి డైట్ మెయింటెయిన్ చేస్తున్నా, ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటివి పుష్కలంగా ఉండేలా చూసుకుంటున్నా కొందరిలో పోషకాల లోపం ఉంటున్నది. అలా ఎందుకు జరుగుతుందో అర్థంకాక వాళ్లు జట్టు పీక్కుంటుంటారు. వైద్యులు కూడా సరిపడా తినడం లేదేమో అని, వేరే వేరే పద్దతులను ప్రయత్నిస్తారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన వైద్యులు విస్తుగొల్పే విషయాలను వివరించారు. కేవలం పల్లెంలో ఏం వడ్డించుకున్నామనేది మాత్రమే కాదు, మొదటి ముద్ద తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందనేది కూడా మన శరీర పోషకాల విషయంలో కీలకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ, పోషకాల శోషణ (Absorption) సరిగ్గా జరగనప్పుడు శరీరం నిశ్శబ్దంగా పోషకాహార లోపంలోకి జారిపోతుంది.

జీర్ణక్రియే సమస్య అయితే?

మనం తీసుకునే ఆహారం శరీరం వాడుకునేలా విచ్ఛిన్నం కావాలి. ఆహారం తీసుకునే విధానం, పరిమాణం, మనం వాడే ఇతర మందులు జీర్ణకోశంపై ప్రభావం చూపుతాయని డాక్టర్ హర్షవర్ధన్ రావు బి వివరించారు. కడుపులో యాసిడ్ స్థాయిలు తగ్గినా లేదా ఎంజైమ్‌లు బలహీనపడినా, ఆహారం సరిగ్గా అరగదు. దీనినే ‘మాల్‌డైజెషన్’ అంటారు, ఇది పోషకాల లోపానికి ప్రధాన కారణం.

పేగుల ఆరోగ్యం ముఖ్యం

మన చిన్న పేగుల్లో ఉండే ‘విల్లి’ అనే సూక్ష్మ నిర్మాణాలు పోషకాలను రక్తంలోకి పంపిస్తాయి. డాక్టర్ సిమ్నా ఎల్ తెలిపిన వివరాల ప్రకారం, దీర్ఘకాలిక వాపులు లేదా పేగు వ్యాధుల వల్ల ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. దీనివల్ల ఐరన్, కాల్షియం వంటివి శరీరానికి అందవు. సెలియాక్ వంటి వ్యాధులు ఏళ్ల తరబడి బయటపడకుండా శరీరాన్ని లోపల నుంచే బలహీనపరుస్తాయి.

ఆహార నాణ్యత, అలవాట్లు

నేలల్లో ఖనిజ లవణాలు తగ్గడం వల్ల పండే పంటల నాణ్యత కూడా తగ్గిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ నివేదించింది. మరోవైపు, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఐరన్ శోషణ తగ్గుతుంది. యాంటీబయాటిక్స్, యాంటాసిడ్స్ వంటి మందులు కూడా పేగుల్లోని మంచి బాక్టీరియాను దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. వయస్సు, ఒత్తిడిని బట్టి పోషకాల అవసరాలు మారుతుంటాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పేర్కొంది.

పరిష్కారం ఏమిటి?

శరీరానికి పోషకాలు అందాలంటే కేవలం ఆహారం పెంచడం సరిపోదు. పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. ఐరన్ ఉన్న ఆహారంతో పాటు విటమిన్ సి కలిపి తీసుకోవడం వల్ల శోషణ పెరుగుతుంది. నీరసం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడకుండా, రక్త పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Read Also: ‘ఇక్కత్’​ రంగుల వెనుక నేతన్నల కన్నీటి వ్యథ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>