Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ స్థలాలపై ముందుగానే నోటీసులు ఇవ్వాలి: మంత్రి లక్ష్మణ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మహాత్మా జ్యోతిబా ఫూలే, బీఆర్ అంబేద్కర్, బాబూ జగజీవన్ రామ్ వంటి మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న ఇబ్బందులపై సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత సంఘాల ప్రతినిధులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ఎదురవుతున్న స్థల సమస్యలు, అనుమతుల జాప్యం, పోలీస్ అనుమతులు, రెవెన్యూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారికి మంత్రి దిశానిర్ధేశం చేశారు.

ముందుగానే నోటీసులు..

నియమ నిబంధనలకు అనుగుణంగా లేని స్థలాల విషయంలో ముందుగానే సంబంధిత సంఘాలకు స్పష్టమైన నోటీసులు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చివరి నిమిషంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, దళిత సంఘాలతో చర్చించి ముందస్తు పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనవసరంగా దళిత సంఘాల నాయకులపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారంపైనే ప్రధాన దృష్టి పెట్టాలని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల మనోభావాలను గౌరవించాలని సూచించారు. మహనీయుల ఆశయాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి (Adluri Laxman) స్పష్టం చేశారు.

విగ్రహాలు రాజ్యాంగ విలువలకు ప్రతీకలు..

మహనీయుల విగ్రహాలు కేవలం శిల్పాలు కావని, అవి సామాజిక చైతన్యానికి, స్వాభిమానానికి, రాజ్యాంగ విలువలకు ప్రతీకలని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని దళితులు, గిరిజనులు, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహనీయుల ఆశయాలను గ్రామస్థాయి నుంచి యువతలోకి తీసుకెళ్లే ప్రక్రియలో విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని.. అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో యాత్ర” దేశంలో సామాజిక ఐక్యత, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం లక్ష్యాలతో సాగిందని గుర్తు చేశారు. విగ్రహాల ప్రతిష్టాపనలో ఎలాంటి అనవసర జాప్యం జరగకుండా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

Read Also: ట్విషా శర్మ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>