కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణి (Singareni) సంస్థలో ఉద్యోగాలు పొందాలనే ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని ఏఐటీయూసీ (AITUC) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారసులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు మాట్లాడుతూ.. ఉద్యోగంలో ఉన్న సమయంలో అనారోగ్యం, ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో కార్మికులు తమ సేవలను కోల్పోయిన సందర్భాల్లో వారి కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో డిపెండెంట్ ఉద్యోగ విధానం అమలులోకి వచ్చిందన్నారు.
అయితే మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించి, అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్నప్పటికీ వందలాది మంది వారసులు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సి రావడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోందన్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మిక కుటుంబాల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యాజమాన్యాన్ని కోరారు.
సింగరేణి సంస్థ లాభాల సాధనలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని నాయకులు అన్నారు. అలాంటి కార్మికుల కుటుంబాలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మెడికల్ ఫిట్ అయిన ప్రతి వారసుడికి ఆలస్యం లేకుండా నియామక పత్రాలు అందజేసి న్యాయం చేయాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం నాయకులు జనరల్ మేనేజర్ షాలెం రాజుకు వినతిపత్రం అందజేశారు. సమస్యను సానుకూలంగా పరిశీలించిన జీఎం, మెడికల్ ఫిట్ డిపెండెంట్ల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

