Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాచలంలో గంజాయి బ్యాచ్ అరెస్ట్‌

కలం, ఖమ్మం బ్యూరో: గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా భద్రాచలం (Bhadrachalam) పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ నిఘాను తీవ్రం చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సరిహద్దు రహదారులపై ముమ్మరంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా భారీగా తరలిస్తున్న ఎండు గంజాయిని పట్టుకొని, నలుగురు నిందితులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ​ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ ల మార్గదర్శకత్వంలో ఎక్సైజ్ సిబ్బంది సరిహద్దు మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఇందులో భాగంగా కూనవరం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఇసుక రీచ్ వద్ద ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్ఐ సిహెచ్. శ్రీహరి రావు తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కూనవరం వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను అధికారులు ఆపి సోదా చేశారు. ​మొదటగా వచ్చిన వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో గుట్టుచప్పుడు కాకుండా దాచి ఉంచిన 4.3 కేజీల ఎండు గంజాయి లభ్యమైంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం నివాసి భానోత్ వీరేందర్ (A1), రమణ గుట్ట ప్రాంతానికి చెందిన గుత్తికొండ యశ్వంత్ (A2)లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అదే సమయంలో వెనుక వస్తున్న రెండో వాహనాన్ని కూడా ఆపి సోదా చేయగా, దానిలో 5.2 కేజీల ఎండు గంజాయి బయటపడింది. ఈ వాహనంలో మత్తు పదార్థాన్ని తరలిస్తున్న ఖమ్మం జిల్లా లెనిన్ నగర్‌కు చెందిన షేక్ ఖాసీం (A3), పాండురంగాపురం ప్రాంతానికి చెందిన షేక్ అమీర్‌ (A4)లను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నలుగురు కలిసి గంజాయిని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన సీలేరు నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఖమ్మం జిల్లాకు తరలించి విక్రయించేందుకు యత్నించినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుల నుండి మొత్తం 9.5 కేజీల ఎండు గంజాయితో పాటు, రవాణాకు ఉపయోగించిన రెండు బైక్ లు, రెండు సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం ఈ కేసును భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>