కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : నీట్-2026 ప్రవేశ పరీక్ష రద్దుకు కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ (NTA) నిర్లక్ష్యమే కారణమని ఏఐఎస్ఎఫ్ (AISF) మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ ఆరోపించారు. పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఎన్‌టీఏ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని అన్నారు. ప్రశ్నపత్రం లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడిందని, వారి సమయం, డబ్బు వృథా అవుతున్నాయని పేర్కొన్నారు. వైద్య విద్యలో ప్రవేశాలకు కీలకమైన ఈ పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. రాజస్థాన్‌లోని ఒక కోచింగ్ సెంటర్ మెటీరియల్‌లో ఉన్న సుమారు 145 ప్రశ్నలు అసలు నీట్ పరీక్షలో రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి పేపర్ లీకేజీలు తరచూ ఉత్తరాది రాష్ట్రాలలోనే జరుగుతున్నాయని ఆరోపించిన లక్ష్మణ్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఇటువంటి ఘటనలు వెలుగుచూడటం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. పేపర్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌తో పాటు నాయకులు భరత్, మహేష్ పాల్గొన్నారు.

