ఎర్రుపాలెం మండలంలో విషాదం.. వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి!

కలం, ఖమ్మం బ్యూరో: భానుడి భగభగలకు జిల్లాలో మరో ప్రాణం బలైపోయింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం (Errupalem) మండలం వెంకటాపురం గ్రామంలో వడదెబ్బ తగిలి ఓ ఉపాధి కూలీ మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ​గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం గ్రామానికి చెందిన సాని కృష్ణ (43) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పనులకు ఆయన ప్రతిరోజూ హాజరవుతుండేవాడు.​ సోమవారం ఉదయం యథావిధిగా ఉపాధి పనులకు వెళ్లిన కృష్ణ, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నీరసంతో వాంతులు చేసుకున్న ఆయనను కుటుంబ సభ్యులు గమనించే లోపే పరిస్థితి విషమించింది. మంగళవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.

​కుటుంబాన్ని సాకుతున్న పెద్ద దిక్కు మరణించడంతో కృష్ణ భార్య, పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. “ఎండలు మండుతున్నా పొట్టకూటి కోసం పనికి వెళ్లక తప్పలేదు, అదే ఆయన ప్రాణం తీస్తుందని ఊహించలేదు” అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ ఉపాధి పనుల వద్ద కూలీలకు సరైన నీడ, మంచినీరు, ఓఆర్ఎస్ వంటి కనీస వసతులు కల్పించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పని సమయాలను మార్చాలని, మృతుని కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ​సంబంధిత అధికారులు స్పందించి, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: బండి భగీరథ్‌ పోక్సో కేసు.. సిట్ కీలక అడుగు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>