కలం, వెబ్ డెస్క్: యూనిటీ కప్ కోసం భారత జాతీయ జట్టుకు ఆటగాళ్ల విడుదల అంశంపై మోహన్ బగాన్ (Mohun Bagan) సూపర్ జెయింట్‌కు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) మధ్య వివాదం మరింత ముదిరింది. మీడియాలో వచ్చిన వార్తలను ఏఐఎఫ్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. మోహన్ బగాన్ అధికారులు ఆరు రోజుల క్రితమే ఏఐఎఫ్ఎఫ్‌కు లేఖ పంపి, FIFA విండో వెలుపల ఆటగాళ్లు గాయపడితే బాధ్యత తీసుకోవాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే అలాంటి లేఖ తమకు అందలేదని ఏఐఎఫ్ఎఫ్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం. సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఏప్రిల్ 10 నుంచే యూనిటీ కప్‌లో భారత జట్టు పాల్గొనడం గురించి అన్ని క్లబ్‌లకు నాలుగు లేఖలు పంపినట్టు ఆయన వెల్లడించారు. ఆటగాళ్ల బయోమెట్రిక్ వీసా ప్రక్రియ కూడా క్లబ్ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహించినట్టు తెలిపారు. ఆటగాళ్లు గాయపడితే ఏఐఎఫ్ఎఫ్ వైద్య ఖర్చులు భరించదన్న వ్యాఖ్యల్నీ ఫెడరేషన్ తోసిపుచ్చింది. 2025-26 సీజన్‌లోనే సీనియర్, వయో విభాగాల జట్ల ఆటగాళ్ల చికిత్స, రిహాబిలిటేషన్ కోసం దాదాపు రూ.15 లక్షలు ఖర్చు చేసినట్టు వివరించింది.
ఈ ప్రక్రియలో మోహన్ బగాన్ తొలుత సహకరించిందని, కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుందని ఏఐఎఫ్ఎఫ్ పేర్కొంది. బయోమెట్రిక్ పరీక్షలకు క్లబ్ ఆటగాళ్లు హాజరయ్యారని, అది క్లబ్‌కు సమాచారం లేకుండా జరగలేదని తెలిపింది. మొత్తం ఏడుగురు మోహన్ బగాన్ ఆటగాళ్లను జాతీయ జట్టుకు ఎంపిక చేయగా, ఒకరు గాయంతో దూరమయ్యారు. మిగిలిన ఆరుగురు మే 22న బెంగళూరు క్యాంప్‌లో చేరి రికవరీ సెషన్‌లో కూడా పాల్గొన్నారు.
అయితే మరుసటి రోజు క్లబ్ నుంచి వచ్చిన ఆదేశాల తర్వాత పరిస్థితి మారినట్టు ఏఐఎఫ్ఎఫ్ తెలిపింది. FIFA అంతర్జాతీయ విండో బయట జాతీయ జట్టుతో ఆడకూడదని, శిక్షణలో కూడా పాల్గొనవద్దని క్లబ్ సూచించినట్టు ఆటగాళ్లు జట్టు మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్టు వెల్లడించింది. దీంతో కొందరు ఆటగాళ్లు భావోద్వేగానికి గురై క్యాంప్ విడిచిపెట్టినట్టు సమాచారం ఇచ్చింది. ఏఐఎఫ్ఎఫ్ జాతీయ జట్ల డైరెక్టర్ సుబ్రత పాల్ కూడా దీనిపై స్పందించారు.
ఏప్రిల్ 10 నుంచే టోర్నీ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అభ్యంతరాలు ముందుగానే చెప్పి ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవకాశం ఉండేదని అన్నారు. చివరి దశలో ఈ పరిస్థితి రావడం వల్ల ఇతర ఆటగాళ్ల అవకాశాలపైనా ప్రభావం పడిందని పేర్కొన్నారు. ఈ తరహా సమస్యలు గతంలో కూడా ఎదురయ్యాయని, భవిష్యత్తులో భారత ఫుట్‌బాల్ ప్రయోజనాల కోసం మెరుగైన సమన్వయం అవసరమని ఏఐఎఫ్ఎఫ్ అభిప్రాయపడింది.

