కలం, వెబ్ డెస్క్: వరల్డ్ కప్ ప్రారంభానికి కొద్ది రోజులే మిగిలి ఉండగా.. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. ఇంటర్ మయామి తరఫున ఆడుతూ మ్యాచ్ మధ్యలోనే బయటకు రావడంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. ఫిలడెల్ఫియా యూనియన్‌తో జరిగిన మేజర్ లీగ్ సాకర్ మ్యాచ్‌లో మెస్సీ 73వ నిమిషంలో మైదానం వీడాడు. ఎడమ కాలి వెనుక భాగాన్ని పట్టుకుని అసౌకర్యంగా కనిపించిన మెస్సీ స్వయంగా బయటకు రావాలని కోరినట్టు సమాచారం. అయితే మైదానం వీడిన తర్వాత ఆయన సాధారణంగానే నడుస్తూ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాడు.
మెస్సీ బయటకు వెళ్లినప్పటికీ ఇంటర్ మయామి మ్యాచ్‌ను 6-4 తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం కోచ్ గిల్లెర్మో హోయోస్ స్పందించారు. మెస్సీ పరిస్థితిపై ఇంకా వైద్య నివేదిక రాలేదని, త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు. వర్షంతో మైదానం బరువుగా మారడం, అలసట కారణంగానే మెస్సీని జాగ్రత్త చర్యగా బయటకు తీసినట్టు వివరించారు. 2023లో ఇంటర్ మయామిలో చేరిన తర్వాత మెస్సీ వర్క్‌లోడ్‌ను జట్టు సిబ్బంది జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. వరుస మ్యాచ్‌లు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయనకు విశ్రాంతి కూడా ఇచ్చారు.
గత కొన్నేళ్లుగా హామ్‌స్ట్రింగ్ సమస్యలు మెస్సీని ఇబ్బంది పెట్టాయి. ఈ ఏడాది ప్రీ-సీజన్‌లో కూడా కొంత భాగం ఆయన దూరంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో తీవ్రమైన గాయం అయితే.. టైటిల్ రక్షణ లక్ష్యంతో బరిలోకి దిగనున్న అర్జెంటీనాకు అది పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. జూన్ 11న మెక్సికో సిటీలో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అర్జెంటీనా తన తొలి మ్యాచ్‌ను ఐదు రోజుల తర్వాత అల్జీరియాతో ఆడనుంది.
ఇదిలా ఉండగా, ఇంటర్ మయామి మ్యాచ్ తర్వాత ఎంఎల్‌ఎస్‌కు వరల్డ్ కప్ విరామం మొదలవుతోంది. మెస్సీ (Lionel Messi) ఇంకా అధికారికంగా వరల్డ్ కప్ ఆడతానని ప్రకటించకపోయినా.. ఇది ఆయనకు రికార్డు సమానమైన ఆరో వరల్డ్ కప్‌గా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. వచ్చే వారం అర్జెంటీనా జట్టును ప్రకటించనున్నారు. ఆ తర్వాత అమెరికాలో జరిగే ప్రీ-వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్‌ల్లో హోండురాస్, ఐస్‌లాండ్‌తో అర్జెంటీనా తలపడనుంది. ప్రస్తుతం మెస్సీ ఫిట్‌నెస్‌పైనే అందరి దృష్టి నిలిచింది.
Read Also: ఆఖరి వరల్డ్ కప్‌కు సన్ హ్యుంగ్ మిన్.. కొరియా జట్టులో టెన్షన్!
Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

