కలం, ఖమ్మం బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ప్రాంతంలో రాజకీయ వేడి నెలకొంది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేపట్టిన రెండో రోజు ‘సింగరేణి బాయి బాట’ కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. కనీసం బ్యానర్ కట్టుకోవడానికి కూడా అనుమతి నిరాకరించడంతో పోలీసులకు, కార్మిక నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది.
అయినప్పటికీ, పోలీసుల ఆంక్షల వలయాన్ని ఛేదించుకుని కల్వకుంట్ల కవిత మణుగూరులోని పీకే ఓసీపీ-2 గని వద్దకు చేరుకున్నారు. ఫస్ట్ షిఫ్ట్ ముగించుకుని వస్తున్న వందలాది మంది కార్మికులతో ఆమె ముఖాముఖిగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 3 వేల ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు. భూగర్భ (అండర్ గ్రౌండ్) గనుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే కార్మికులు, అనివార్య కారణాల వల్ల ఉపరితల (ఓపెన్‌కాస్ట్) గనుల్లోకి వస్తే వారి వేతనాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే ‘ఎన్ మైనస్ వన్’ విధానాన్ని రద్దు చేసే వరకు తాము విశ్రమించబోమని, కార్మికుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
దీంతో పాటు, పబ్లిక్ హాలిడేల విషయంలో సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ, కార్మికులకు లబ్ధి చేకూర్చే విధంగా అనుకూలమైన విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కంటితుడుపు చర్యలు ఆపి, సింగరేణి కార్మికుల సమస్యలను, పెండింగ్ బకాయిలను తక్షణమే పరిష్కరించాలని హెచ్చరించారు. లేనిపక్షంలో సింగరేణి వ్యాప్తంగా గాంధేయ మార్గంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు

