కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని సన్‌షైన్ ఆసుపత్రిలో చట్టపరమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని సోమవారం కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’ కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
చట్టాల ఉల్లంఘన..
ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో NDPS చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నివేదికలో తేలిందన్నారు. బాధ్యులపై వెంటనే కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ నిబంధనల ప్రకారం ఆసుపత్రి రిజిస్ట్రేషన్, ఫార్మసీ లైసెన్స్ తక్షణమే రద్దు చేయాలన్నారు. అలాగే, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు పంపి, కారణమైన సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకునేలా కలెక్టర్ చొరవ చూపాలని కోరారు.
విచారణ జరుపుతామని కలెక్టర్ హామీ..
అత్యవసర వైద్య సేవలు అందించే ఆసుపత్రిలో కనీస ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక) ప్రమాణాలు లేవని అధికారులు గుర్తించినా.. కేవలం లక్ష రూపాయల ఫైన్ వేసి వదిలివేయడం దారుణమని బండారి శేఖర్ అన్నారు. అధికారులకు అన్నీ తెలిసినా మౌనంగా ఉండటం వెనుక ఉన్న అంతర్యమేమిటి? ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్న హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంబంధిత పథకాల (EHS)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అదనపు కలెక్టర్ డా.అశ్విని తానాజీ వాకడేతో విచారణ జరిపించి, 10 రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని శేఖర్ వెల్లడించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బద్రి నేత నాయకులు రాజిరెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.

