కలం, వెబ్ డెస్క్: ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు కఠినంగా అమలు చేయడం లేదన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైడ్రా (HYDRA) అధికారులు రంగంలోకి దిగారు. నగరవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ (AV Ranganath) నేతృత్వంలో గురువారం హైదరాబాద్‌లోని పలు దుకాణాలు, షోరూమ్‌లలో ఈ తనిఖీలు కొనసాగాయి. విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఈ సోదాలు చేపట్టారు. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్న అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లు గుర్తించిన నాంపల్లిలోని ఒక ఫర్నీచర్ షాప్‌తోపాటు, నీరూస్ వస్త్ర దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకపోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు సరిగా లేనట్లు అధికారులు గుర్తించారు.
ఇలాంటి నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని పేర్కొన్న హైడ్రా కమిషనర్, నిబంధనలు పాటించని దుకాణాలు, వాణిజ్య సముదాయాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగరంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఇకపై ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సీజ్ చర్యలతో పాటు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హైడ్రా (HYDRA) అధికారులు హెచ్చరించారు.
Read Also: కేసీఆర్‌కు నోటీసులు అంటే యావత్ తెలంగాణకు నోటీసులే
Follow Us On: Instagram


