కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను పెంపొందించాల్సిన అవసరాన్ని అధికారులు నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ అడిషనల్ ఎస్పీ ఎన్.బి రత్నం(Additional SP Ratnam) బోయపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదగాలంటే ఉపాధ్యాయులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
విద్యార్థులు కూడా ఒక స్పష్టమైన లక్ష్యంతో చదవాలని, తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఆయన (Additional SP Ratnam), పలు ప్రశ్నలు అడిగి వారి ద్వారానే సమాధానాలు చెప్పించారు. ఈ విధానం ద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంపొందించవచ్చని తెలిపారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఉపాధ్యాయుల మార్గదర్శనం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎంఈఓ లక్ష్మణ్ సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణలో మాఫియా రాజ్యమేలుతోంది: కేటీఆర్
Follow Us On: Instagram

