Mobile Popup Ad
Mobile Popup Ad

అందుకే విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ (Young India Welcome Kits) పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేసిందని మండిపడ్డారు. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యా శాఖను తన దగ్గరే పెట్టుకున్నానని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని తాము సంపూర్ణంగా విశ్వసించామని పేర్కొన్నారు. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించామని.. అందుకే బడ్జెట్ లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించామని తెలిపారు. విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, ఇది ఖర్చుగా కాదు…భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా తాము భావిస్తున్నట్లు వెల్లడించారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం..

తమ ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరన్న సీఎం.. ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించామని హర్షం వ్యక్తం చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపబోతున్నామని పేర్కొన్నారు.

ఏఐ ముప్పును గుర్తించాం..

ఏఐ తుఫాన్ తో కోట్లాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారనే విషయాన్ని గ్రహించామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించామని, యువతకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి పదును పెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. సోషల్ వెల్ఫేర్ లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లుగా, ఐఏఎస్ లుగా, ఐపీఎస్ లుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు.

Read Also: అక్క‌డ‌ బీచ్‌లో నిద్ర‌పోతున్న‌ జ‌నం.. ఎందుకంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>