కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రభుత్వం కాదు.. మాఫియా రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు పూర్తిగా విసిగిపోయారని.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానేనని స్పష్టం చేశారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఏ ఎన్నికలొచ్చినా పార్టీ గెలుపు కోసం కార్యకర్తలే కథానాయకులై కదంతొక్కాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలోనూ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్‌తోనే సాధ్యం..
తెలంగాణకు మళ్లీ మంచిరోజులు రావాలన్నా, హైదరాబాద్ అభివృద్ధి పట్టాలపై పరుగులు పెట్టాలన్న అది బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ప్రజలు గుండెలనిండా ఆశీర్వదిస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల మాదిరిగా ముందుకు సాగాయని చెప్పారు. 2014 కు ముందు ఎండాకాలం వచ్చిందంటే చాలు కరెంట్ కష్టాలతో ప్రజలు అల్లాడిపోయే వారని గుర్తుచేశారు. కేసీఆర్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్టటిన ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల కరెంట్ సమస్యను శాశ్వతంగా తీర్చారని గుర్తు చేశారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి అటు వ్యవసాయానికి, ఇటు గృహ అవసరాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు.
సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించాం
కేసీఆర్ హయాంలో సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 2000కు పెంచుకున్నామని, ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టామని తెలిపారు. మల్కాజ్‌గిరిలోనే 3500 డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చుకున్నామని తెలిపారు. 15 లక్షల మంది ఆడబిడ్డల పెండ్లిళ్లకు కళ్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు అందించి ఆదుకున్న మేనమామ కేసీఆర్ అని కొనియాడారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ అసమర్థ పాలనను చూసి తిట్టుకోని రోజు లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పాడని, తులం బంగారం ఇస్తాం, రైతుభరోసా 15 వేలు చేస్తాం, పెన్షన్‌ను డబుల్ చేస్తామని అడ్డగోలు హామీలిచ్చారని విమర్శించారు.

