కలం, కరీంనగర్(జగిత్యాల): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరుకి అవకాశం కల్పించాలని జగిత్యాల (Jagtial) జిల్లా అదనపు కలెక్టర్ (Additional Collector) బీఎస్ లత (BS Latha) అధికారులను ఆదేశించారు. శనివారం మేడిపెల్లి మండలంలో బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి SIR ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.
ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ SIR ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలని అన్నారు. ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని సరైన సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, సంబంధిత సిబ్బంది, బీఎల్ఓలు, తదితరులు పాల్గొన్నారు.

