వీర్ చోత్రానీ జోరు.. భారత స్క్వాష్‌కు కొత్త ఆశలు

కలం, స్పోర్ట్స్ : భారత స్క్వాష్‌కు (India Squash) ప్రస్తుతం కొత్త ఊపు వచ్చింది. 18 ఏళ్ల అనాహత్ సింగ్ ప్రపంచ జూనియర్ టైటిల్ గెలుచుకున్న తర్వాత దేశంలో ఈ క్రీడపై ఆసక్తి మరింత పెరిగింది. అదే సమయంలో పురుషుల విభాగంలోనూ భారత్ తన స్థాయిని పెంచుకుంటోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అభయ్ సింగ్ 24వ స్థానంలో, వీర్ చోత్రానీ (Veer Chotrani) 38వ స్థానంలో కొనసాగుతున్నారు. రమిత్ టాండన్, వేలవన్ సెంథిల్‌కుమార్ కూడా ప్రపంచ టాప్-60లో చోటు దక్కించుకున్నారు. ఒకేసారి నలుగురు భారత ఆటగాళ్లు టాప్-60లో ఉండటం అరుదైన ఘనతగా నిలిచింది.

చిన్నప్పటి నుంచే స్క్వాష్‌తో అనుబంధం

వీర్ చోత్రానీకి స్క్వాష్ కొత్త క్రీడ కాదు. ఆయన తండ్రి మనీష్ చోత్రానీ జాతీయ ఛాంపియన్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. దీంతో చిన్నప్పటి నుంచే వీర్ స్క్వాష్ కోర్టులలో పెరిగాడు. నాలుగేళ్ల వయసులోనే శిక్షణ ప్రారంభించిన ఆయన.. ఆరేళ్లు, ఏడేళ్ల వయసులోనే టోర్నీలలో పాల్గొనడం మొదలుపెట్టాడు. జూనియర్ స్థాయిలో పలు ఆసియా టైటిళ్లు సాధించిన వీర్.. వివిధ వయసు విభాగాలలో భారత్ జూనియర్ నంబర్-1గా నిలిచాడు. అనంతరం అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో సైకాలజీ చదివాడు. అక్కడ మాజీ ప్రపంచ నంబర్-1 డేవిడ్ పాల్మర్ వద్ద శిక్షణ పొందాడు. ప్రస్తుతం కూడా పాల్మరే వీర్‌కు కోచ్‌గా కొనసాగుతున్నారు. అమెరికా కాలేజీ స్క్వాష్ స్థాయి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ప్రొఫెషనల్ క్రీడకు అవసరమైన అనుభవం అక్కడ లభించిందని వీర్ తెలిపాడు.

ఒలింపిక్స్‌తో స్క్వాష్‌కు మరింత గుర్తింపు

లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌లో స్క్వాష్‌కు చోటు దక్కడం ఈ క్రీడకు కీలక మలుపుగా వీర్ భావిస్తున్నాడు. ఒలింపిక్స్‌లో భాగమైన క్రీడకు సహజంగానే ఎక్కువ ప్రచారం, గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నాడు. భారత్‌లో ఛాంపియన్లకు అభిమానులు ఎక్కువగా ఉంటారని, అనాహత్ సింగ్ ప్రపంచ జూనియర్ టైటిల్ సాధించడం కూడా స్క్వాష్‌కు మరింత ఆదరణ తీసుకొచ్చిందని చెప్పాడు.

అభయ్ సింగ్‌తో ఆసక్తికర పోటీ

వీర్ చోత్రానీ, అభయ్ సింగ్ మధ్య పోటీ భారత స్క్వాష్‌కు మరింత బలాన్నిస్తోంది. గత సీజన్‌లో వీరిద్దరూ మూడుసార్లు తలపడగా.. వీర్ 2-1తో ఆధిక్యంలో నిలిచాడు. న్యూయార్క్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో వీర్ విజయం సాధించగా.. ముంబైలో జరిగిన జేఎస్‌డబ్ల్యూ ఓపెన్ ఫైనల్లో అభయ్ గెలిచాడు. అనంతరం గత మేలో కైరోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో వీర్ మళ్లీ విజయం సాధించాడు. సొంత దేశ ఆటగాడితో పెద్ద టోర్నీలలో తలపడటం కొంత కష్టమే అయినప్పటికీ.. ఈ పోటీ తనను మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రేరేపిస్తుందని వీర్ చెప్పాడు. తన వెనుక రమిత్ టాండన్, వేలవన్ సెంథిల్‌కుమార్ కూడా బలంగా ఉన్నారని పేర్కొన్నాడు.

భారత్‌లో శిక్షణకు ఇంకా సవాళ్లు

భారత్‌లో స్క్వాష్ కోర్టులు, అవసరమైన సౌకర్యాలు ఉన్నప్పటికీ.. సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ భాగస్వాముల కొరత ఉందని వీర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత్ టాప్-4 పురుషుల ఆటగాళ్లు దేశంలో శిక్షణ తీసుకోవడం లేదని, మంచి ట్రైనింగ్ పార్ట్‌నర్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వివరించాడు. ఈ విషయంలో ఈజిప్టును వీర్ ఉదాహరణగా చూపించాడు. అక్కడ చిన్న వయసు ఆటగాళ్లకు ప్రపంచ స్థాయి ప్లేయర్లతో కలిసి శిక్షణ పొందే అవకాశం ఉంటుందని తెలిపాడు. మంచి కోచ్‌లు, ఫిట్‌నెస్ సిబ్బంది, స్పోర్ట్స్ సైకాలజిస్టులు ఒకే చోట అందుబాటులో ఉండే వ్యవస్థ భారత్‌లోనూ అవసరమని సూచించాడు. అలాంటి వాతావరణం ఏర్పడితే భారత ఆటగాళ్లు శిక్షణ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నాడు.

చదువుతో పాటు క్రీడ కొనసాగించొచ్చు

భారత కుటుంబాలలో చదువుకు అధిక ప్రాధాన్యం ఉంటుందని వీర్ చెప్పాడు. మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి రంగాల వైపు పిల్లలను పంపాలని చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటారని వివరించాడు. చాలా మంది జూనియర్ స్క్వాష్ ఆటగాళ్లు మంచి స్థాయికి చేరుకున్న తర్వాత అమెరికాలో డిగ్రీలు చేస్తూ.. అనంతరం క్రీడకు దూరమవుతున్నారని తెలిపాడు. అయితే చదువుతో పాటు క్రీడను కూడా విజయవంతంగా కొనసాగించవచ్చని స్పష్టం చేశాడు. తనతో పాటు రమిత్ టాండన్, వేలవన్ సెంథిల్‌కుమార్ కూడా అందుకు ఉదాహరణలేనని పేర్కొన్నాడు. భారత్‌లో ప్రతిభకు సరైన శిక్షణ వాతావరణం కల్పిస్తే మరింత మంది ఆటగాళ్లు ప్రొఫెషనల్ స్థాయిలో కొనసాగేందుకు అవకాశం ఉంటుందని వీర్ అభిప్రాయపడ్డాడు. దేశంలో స్క్వాష్ అభివృద్ధికి మరింత బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>