కలం, తుర్కపల్లి : తాటి చెట్లు గౌడ కులస్తుల జీవనోపాధికి ప్రధాన ఆధారమని, వాటి ద్వారా వచ్చే ఆదాయంతోనే అనేక కుటుంబాలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయని తుర్కపల్లి ఉప సర్పంచ్ పల్లె నరేష్ గౌడ్ అన్నారు. కొంతమంది వెంచర్ డెవలప్‌మెంట్ లో భాగంగా ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 20 చెట్లకు పైగా (Turkapally Toddy) ఉద్దేశపూర్వకంగా నరికివేయడం జరిగిందని దీని వలన ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు.
రియల్ ఎస్టేట్ మాఫియా పేరుతో గౌడ కులస్తుల పొట్టపై కొట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు. తాటి చెట్లు గౌడ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఆస్తులని, వాటిని నాశనం చేయడం ద్వారా పేద కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం, రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి తాటి చెట్లను పరిరక్షించాలని, బాధ్యులను గుర్తించి చట్టరీత్యా శిక్షించాలని ఆయన కోరారు. అలాగే నష్టపోయిన గౌడ కుటుంబాలకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

