కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్(KCR) ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(Addanki Dayakar) ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్(SIT) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన దీనిపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడమనేది ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్‌కు తెలియకుండా ఏ పని జరిగి ఉండదని చెప్పారు. కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, కవిత కేసీఆర్ పాలనలో ఉత్సవ విగ్రహాలేనని, కేసీఆర్ చెప్తేనే ఏ శాఖలో అయినా పనులు జరిగేవని తెలిపారు.
ఇప్పటి వరకు ఈ కేసులో సిట్ ఎవరిని విచారించినా కేసీఆర్ పేరు రావడంతోనే కేసీఆర్‌కు నోటీసులు పంపినట్లు దయాకర్ వెల్లడించారు. తప్పు చేసి కూడా తప్పించుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ నేతలు పలు అబద్ధపు ఆరోపణలు చేశారన్నారు. కేసీఆర్ విచారణలో వాస్తవాలు చెప్తే అన్నింటికి మంచిదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంతోమంది రాజకీయ నాయకులు, అధికారుల జీవితాలు నాశనం అయ్యాయని తెలిపారు.


