కలం, వెబ్ డెస్క్: నేడు ప్రముఖ డైరెక్టర్ దాసరి నారాయణ రావు వర్ధంతి సందర్భంగా టాలీవుడ్ నటి హేమ (Actress Hema) ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా హేమ ఒక వీడియోను విడుదల చేశారు. నేడు దాసరి వర్ధంతి అన్న విషయమే తనకు గుర్తు లేదని చెప్పారు. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోను చూసి నివాళులు అర్పించేందుకు వచ్చానన్నారు. సమాధి వద్ద ఉన్న పరిస్థితులు చూసి ఎలా క్లీన్ చేయాలో అని ఆలోచించినట్లు చెప్పారు. అందుకే ముందస్తుగా నలుగురు మనుషులను మాట్లాడి వెంటబెట్టుకొని వచ్చినట్లు తెలిపారు. అయితే తాము వచ్చే సరికే అంతా శుభ్రంగా ఉండటం పట్ల హేమ సంతోషం వ్యక్తం చేశారు.
గురువు గారే నన్ను మర్చిపోయారా అంటూ అందరినీ సమాధి వద్దకు రప్పించుకున్నారని హేమ అన్నారు. ఇక దాసరి సమాధి వద్ద హేమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాసరి నారాయణ రావు బతికి ఉంటే తన లైఫ్ మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆయన ఆశీస్సులు తన మీద ఉంటాయని చెప్పారు. తాను చేతి నిండా సినిమాలతో బిజీగా మారాలని, మంచి రాజకీయ నాయకురాలిగా ఎదగాలని ప్రార్థించారు. ఇటీవల పలు వివాదాలతో తప్ప సినిమాల్లో పెద్దగా కనిపించని హేమ రాజకీయ నాయకురాలిగా ఎదగాలని వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

