కలం, వెబ్ డెస్క్: భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు ఈ ఏడాది జరగబోయే ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో ఊహించని షాక్ తగిలింది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆమె అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. అయితే ఈ ఓటమి తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. తాను ఓడిపోగానే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధికారులు చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకున్నారని వినేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ దృశ్యం చూడగానే తాను మోసపోయిన ఫీల్ కలిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫెడరేషన్ లోని కొందరు వ్యక్తులు తన కెరీర్ త్వరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నారని, కానీ తాను అంత సులువుగా లొంగిపోనని, భవిష్యత్తులో ఆటతోనే అందరికీ సమాధానం చెబుతానని పట్టుదలను వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలపై వినేష్ భర్త, కోచ్ అయిన సోమ్‌వీర్ రాఠీ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంలో తాము మోసపోయామని ఆయన అన్నారు. వినేష్ గెలవడం ఫెడరేషన్‌కు అస్సలు ఇష్టం లేనట్టుగా ప్రవర్తించిందని ఆరోపించారు. కోర్టు వివాదాలు, ఫెడరేషన్ వ్యవహారాల వల్ల తాము మానసికంగా ఎంతో అలసిపోయామని, అయినప్పటికీ వినేష్ త్వరలోనే మళ్లీ శిక్షణ ప్రారంభించి బలంగా తిరిగి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. నిజానికి ఈ సెలక్షన్ ట్రయల్స్ ప్రారంభానికి ముందు నుంచే అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మొదట వినేష్‌ను కేవలం 50 కేజీల విభాగంలోనే పోటీ పడాలని డబ్ల్యూఎఫ్ఐ నిబంధన విధించింది. దీనిని సవాలు చేస్తూ వినేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరకు కోర్టు జోక్యం, సుదీర్ఘ చర్చల తర్వాత ఆమెకు నచ్చిన 53 కేజీల విభాగంలో పోటీ పడేందుకు ఫెడరేషన్ అనుమతి ఇచ్చింది. చాలా కాలం విరామం తర్వాత బరిలోకి దిగిన వినేష్.. మొదటి మ్యాచ్‌లో జ్యోతిపై 7-1 తేడాతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లో నిషుపై 7-6 తో హోరాహోరీగా గెలిచి సెమీస్ చేరారు.
అయితే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మీనాక్షి గోయత్ గట్టి పోటీని ఇచ్చారు. ఈ ఉత్కంఠ పోరులో వినేష్ 4-6 తేడాతో ఓటమిపాలవడంతో ఆసియా గేమ్స్ రేసు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆసియా గేమ్స్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీకి వినేష్ ఫోగట్ దూరం కావడం క్రీడా ప్రేమికులను నిరాశకు గురిచేస్తోంది. ఒకవైపు క్రీడాకారిణి ఆరోపణలు, మరోవైపు ఫెడరేషన్ నిర్ణయాల వెనుక ఉన్న అసలు వాస్తవాలు మున్ముందు తేలాల్సి ఉంది.

