కలం, కరీంనగర్ బ్యూరో: ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ రావణ్, నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, జగిత్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు (ACS Raju) డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో రాజు మాట్లాడుతూ.. ప్రశ్న రావణ్ హిందూ దేవీదేవతలను అవమానకరంగా మాట్లాడటంతో పాటు హిందువులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడే వారిపై అసభ్య పదజాలంతో దాడి చేస్తూ, జాతీయస్థాయిలో కుల, మత, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
“ఈ దేశం నాకు ఇష్టం లేదు. ఈ దేశం ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఉంది” అంటూ ప్రశ్న రావణ్ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఏసీఎస్ రాజు పేర్కొన్నారు. పోలీసు దర్యాప్తులో వీరి వెనుక ఒక క్రైస్తవ మాఫియా పనిచేస్తున్నట్లు, వీరికి ఆంధ్రప్రదేశ్ లోని కొంతమంది ప్రతిపక్ష రాజకీయ నాయకులు, నటుడు ప్రకాష్ రాజ్ వంటి వారు ఆర్థిక సహాయం అందిస్తున్నారని రాజు ఆరోపించారు. అంతేకాకుండా ప్రశ్న రావణ్ మహిళల అభ్యంతరకర వీడియోలు చిత్రీకరించి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం ఉందని తెలిపారు.
ప్రశ్న రావణ్ పై ఇప్పటికే నమోదైన కేసుల మాదిరిగానే, వీరి వెనుక ఉన్న వ్యక్తులందరినీ గుర్తించి వారిపై కూడా అదే తరహా కేసులు నమోదు చేయాలని కోరారు. ఇకపై ఎవరూ హిందూ మతం, హిందూ దేవుళ్లు, దేశాన్ని కించపరిచేలా మాట్లాడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఏసిఎస్ రాజు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జగిత్యాల మున్సిపల్ 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, నాయకులు వేముల పోచమల్లు, వేముల దేవరాజం, కొత్తకొండ బాలన్న, నరేందుల శ్రీనివాస్, గాదాసు భూమన్న, చిలుక రాజన్న, వడ్డేపల్లి మురళి, నాయని సంజీవరావు, బొందుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

