Mobile Popup Ad
Mobile Popup Ad

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం

కలం, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) (ACB) అధికారుల వలకు చిక్కాడు. మసీదు భూమికి సంబంధించిన నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ ఎస్కే మహమూద్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అసలేం జరిగిందంటే.. పెద్దవూరలోని మసీదుకు సంబంధించి గతంలో కొందరు దాతలు సుమారు 996.33 గజాల భూమిని విరాళంగా ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూమి ధరలు అమాంతం పెరగడంతో, సదరు దాతల వారసులు ఆ స్థలంపై కన్నేశారు. ఈ క్రమంలో ఆ భూమి అన్యాక్రాంతం కాకూడదని, అది వక్ఫ్ బోర్డుకే చెందాలని కోరుతూ మసీదు నిర్వాహకులు వక్ఫ్ బోర్డుకు లేఖ రాశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులు ఇన్‌స్పెక్టర్ మెహమూద్‌ను ఆదేశించారు.

అయితే మసీదుకు అనుకూలంగా, సరైన సప్లమెంటరీ రిపోర్టును ఈఓ కి సమర్పించాలంటే తనకు లంచం ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ మహమూద్ మసీదు నిర్వాహకుడిని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బాధితుడి నుంచి రూ. 10,000 లంచం తీసుకుంటుండగా వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ ఎస్కే మహమూద్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ అరెస్ట్ అనంతరం నల్లగొండ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ఉన్న వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అలాగే మిర్యాలగూడలోని మందులవారి కాలనీలో ఉన్న మహమూద్ నివాసంలోనూ ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ జగదీష్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>